![]() |
![]() |
టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకమైన బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘రామాయణ’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెండితెర అద్భుతంలో ఆమె సీతమ్మ పాత్రను పోషిస్తోంది. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో సాయి పల్లవి డబ్బింగ్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. హిందీ భాషలో ఆమె డైలాగ్ డెలివరీపై వస్తున్న విమర్శలు ఈ భారీ ప్రాజెక్టుపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటీవల సాయి పల్లవి నటించిన హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ విడుదలైంది. ఈ సినిమా కోసం ఆమె స్వయంగా హిందీలో డబ్బింగ్ చెప్పుకుంది. అయితే, హిందీ ఉచ్చారణ విషయంలో ఆమె కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందని, మాటలు స్పష్టంగా లేవని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. మాతృభాష ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని, కొన్ని కీలక సన్నివేశాల్లో భావం పలకడం లేదని ట్రోల్స్ వస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ‘రామాయణ’ సినిమాపై పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
నిజానికి దర్శకుడు నితేష్ తివారీ తన సినిమాలో ప్రతి పాత్రకు నటీనటుల సొంత వాయిస్ ఉండాలని కోరుకుంటారు. రామాయణంలో రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్ ఇప్పటికే తన డైలాగ్స్ విషయంలో ఎంతో కసరత్తు చేస్తున్నారు. సాయి పల్లవి కూడా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో తన పాత్రలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటూ ఆయా భాషల ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ, ‘ఏక్ దిన్’ విషయంలో వచ్చిన నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ చూశాక, సీత పాత్రకు ఆమెతోనే హిందీ డబ్బింగ్ చెప్పించాలా వద్దా అనే సందిగ్ధంలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం.
రామాయణం వంటి పౌరాణిక గాథల్లో భాషా పరిజ్ఞానం, స్పష్టమైన ఉచ్చారణ ఎంతో కీలకం. హిందీలో క్లిష్టమైన పదాలు పలకాల్సి ఉంటుంది కాబట్టి, చిన్న పొరపాటు జరిగినా సీతమ్మ పాత్ర గాంభీర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే, హిందీ వెర్షన్ కోసం వాయిస్ ఆర్టిస్ట్‌ను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అయితే దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ్‌లో మాత్రం సాయి పల్లవి గొంతే వినిపించనుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. యష్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి రామాయణం హిందీ వెర్షన్ కోసం సాయి పల్లవి తన భాషను మెరుగుపరుచుకుని విమర్శకులకు సమాధానం ఇస్తుందో లేక డబ్బింగ్ విషయంలో వెనక్కి తగ్గుతుందో వేచి చూడాలి.
![]() |
![]() |